ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో లో సుమారు 2 లక్షల ఎకరాలు వరకూ రొయ్య సాగు చేపడుతున్నారు. దీనిద్వారా ప్రతి సంవత్సరం కాస్త అటుఇటుగా సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఆదాయం కూడా సుమారు రూ.20 వేల కోట్ల వరకూ లభిస్తోంది. ఇంతటి భారీ ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నా కూడా అనధికారిక హేచరీలు రొయ్య రైతులను నిలువునా ముంచేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.
రొయ్య ఎగుమతిదారుల జాతీయ సంఘం యాంటీబయోటిక్స్ వాడిన రొయ్యలను కొనుగోలు చేయబోమని నిర్నయించింది. అనధికారిక హేచరీల నిర్వాహకులు వివిధ వ్యక్తుల వద్ద తల్లి రొయ్య పిల్లలను కొనుగోలు చేసి వాటిని తమ హేచరీల్లో పెంచి యాంటీబయోటిక్స్ ఇచ్చి అమ్మకం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఇటువంటి నకిలీ హేచరీలు ఉన్నాయి. వీటితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 250 వరకూ హేచరీలు ఉండగా వీటిలో అధికారికంగా గుర్తింపు పొందినవి కేవలం 100లోపు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 150 హేచరీలు కూడా అనధికారికంగా నిర్వహిస్తున్నవే. రొయ్య రైతు లాభ, నష్టాలను తొలిదశలో హేచరీలే నిర్ణయిస్తాయి. హేచరీల వద్ద పిల్లలను రైతులు కొనుగోలు చేస్తుంటారు. నిబంధనల ప్రకారం రొయ్య పిల్లలను గుర్తింపు పొందిన హేచరీలే అమ్మాలి. చెన్నైలోని కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ ద్వారా గుర్తింపు పొందిన హేచరీల్లో ఈ రొయ్య పిల్లలు లభిస్తాయి. అమెరికా, ఇతర దేశాల్లో తయారైన తల్లి రొయ్యలను కొనుగోలు చేసి చెన్నైలోని రొయ్యపిల్లల అభివృద్ధి, సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు పిల్ల రొయ్యలను ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఎటువంటి యాంటీబయోటిక్స్ వాడకం ఉండదు. ఈ పిల్లలను అనుమతి పొందిన హేచరీలు నిర్వాహకులు కొనుగోలు చేసి కొంత లాభం వేసుకుని రొయ్య రైతులకు అమ్ముతుంటారు. ఇలా అధికారికంగా అన్ని జ్రాగత్తలు తీసుకుని తయారైన రొయ్య పిల్లలకు ఎటువంటి యాంటీబయోటిక్స్ వాడరు. ఇటువంటి రొయ్య పిల్లల వల్ల భవిష్యత్తులో కూడా సమస్యలు ఉండవు. కౌంటు కూడా బాగా పెరుగుతుంది.
సీఏఏ అనుమతి పొందిన వనామి హేచరీల లిస్ట్
ఇప్పుడు యాంటీబయోటిక్స్ వాడకం ఉన్న రొయ్యలను తాము కొనుగోలు చేయబోమని చెప్పి కొనుగోళ్లు నిలుపుదల చేస్తే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల రొయ్యలకు తెల్లమచ్చల వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీనివల్ల రొయ్యలు భారీగా చనిపోతున్నాయి. పెరిగాకా కొనుగోళ్లు జరగకపోతే రెండోరకంగా నష్టం ఏర్పడుతుందంటున్నారు. వీటిని అరికట్టాలంటే నకిలీ హేచరీలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. యాంటీబయోటిక్స్ వాడకం ఉంటే ఎగుమతులు నిరాకరణకు గురవుతున్నాయని దీనివల్ల తాము భారీగా నష్టపోతున్నామని ఎగుమతిదారులూ పేర్కొంటున్నారు.
ఇటీవల కాలంలో సుమారు 40 నుంచి 50 వరకూ కంటైనర్లు వెనక్కి వచ్చాయంటున్నారు. దీంతో సుమారు రూ.వంద కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. దీనిని అరికట్టాలనే ఉద్దేశంతోనే తాము యాంటీబయోటిక్స్ వాడకం ఉన్న రొయ్యలను కొనుగోలు చేయడం మానుకున్నామంటున్నారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధికారులు కలుగజేసుకుని నకిలీ హేచరీలపై ఉక్కుపాదం మోపితే రాబోయే సీజన్‌లోనైనా ఈ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
యాంటీబయోటిక్స్ వాడుతున్న అనధికారిక హేచరీలు – నష్టపోతున్న ఆక్వా రైతులు
Source : eenadu
The post యాంటీబయోటిక్స్ వాడుతున్న అనధికారిక హేచరీలు – నష్టపోతున్న ఆక్వా రైతులు appeared first on Kisan Updates.