ఆక్వా రంగాన్ని రైతులు వ్యవసాయరంగంగా భావిస్తూ ఆదాయపన్ను చెల్లించడం లేదని, ఇది సరిన విధానం కాదని ఆక్వా రంగం వ్యవసాయ రంగంగా పరిగణించబడదని ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ (వైజాగ్–1) బీజీ రెడ్డి స్పష్టం చేశారు. భీమవరం ఏఎస్‌ఆర్ సాంస్కృతిక కేంద్రంలో శుక్రవారం ఆక్వా రంగం ప్రముఖులు, రైతుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆదాయపన్ను చెల్లించకపోవడం వల్ల దేశాభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
ఆదాయపన్ను సక్రమంగా చెల్లించకుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇబ్బందులు తప్పవన్నారు. రానున్న కాలంలో బ్లాక్‌మనీ వినియోగం అత్యంత కష్టమని అందువల్ల ప్రతి వ్యక్తి సంపాదనలో అర్హత మేరకు పన్నులు చెల్లించడం వల్ల ఆయా వ్యక్తులకు, సమాజానికి మేలు కలుగుతుందన్నారు. ఈ సదస్సులో ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్లు జీవీ గోపాలరావు(రాజమహేంద్రవరం), సీసీహెచ్ ఓంకారేశ్వర్(వైజాగ్–2) ఇతర అధికారులు పాల్గొన్నారు. సదస్సులో పలువురు ప్రముఖులు, రైతులు మాట్లాడారు.
ఆక్వారంగంలోని రైతులంతా ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నారనే ఆపోహ ప్రభుత్వ వర్గాల్లో ఉంది. పదిశాతం మంది రైతులు మాత్రమే విజయం సాధిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, నాణ్యమైన సీడ్ లభ్యం కాక తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గుర్తించకుండా పన్ను పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. – మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ, ఆక్వా రైతు
వ్యవసాయ పన్ను చెల్లిస్తున్నాం
రొయ్యలు, చేపల చెరువులు రైతులు నేటికీ ప్రభుత్వానికి వ్యవసాయపన్ను చెల్లిస్తున్నారు. అందువల్లనే రైతులు ఆక్వాను వ్యవసాయరంగంగా పరిగణిస్తున్నారు. అయితే ఆక్వా వ్యవసాయరంగంలోకి రాదని చెప్పడం విడ్డూరం. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా రంగంపై ఆధారపడి ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. – వి.రామచంద్రరాజు,ఆక్వా రైతుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు
సరైన పన్నుల విధానం ఉండాలి
పన్నుల విధానంలో చట్టసభల్లో ప్రజాప్రతినిధులు సరైన విధానాన్ని అనుసరించాలి. ఆదాయపన్నును రైతులు ఆన్‌లైన్ విధానంలో చెల్లించుకునే వి«ధంగా వారికి అవగాహన కల్పించాలి. ముందుగా పన్నులు చెల్లింపు విధానంపై ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. – ఐపీఎల్ మోహన్‌రాజు, ఆలిండియా ఆక్వా ఫార్మర్స్ ఫెడరేషన్ చైర్మన్
Aqua Farmers Pay Tax Compuslary
Source : Sakshi
The post ఆక్వా రైతులు పన్ను చెల్లించాల్సిందే appeared first on Kisan Updates.