MPEDA తాజా లెక్కల ప్రకారం 2015-16 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 9,45,892 మెట్రిక్ టన్నుల మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రూ. 30,420 కోట్ల ఆదాయాన్ని పొందగలిగాము. దీనిలో ఒక్క మన రాష్ట్రం 1,67,130 మెట్రిక్ టన్నుల ఎగుమతులకు గాను రూ. 9,328 కోట్లను ఆర్జించగలిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 5.6 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఎంపిఈడిఎ అంచనా వేస్తోంది. వనామీ, బ్లాక్ టైగర్ వంటి విభిన్న వెరైటీల రొయ్యల ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆక్వా రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆధునిక పద్ధతులను అమలు చేయడం ద్వారా ఈ ఏడాది నుంచి ఆదాయాన్ని మరింత పెంచుకునే వ్యూహంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.
భారత్ సముద్ర ఉత్పత్తులకు ఇప్పటికీ అమెరికాయే ప్రధాన దిగుమతిదారునిగా ఉంది. అమెరికాకి దిగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో భారత్ వాటా 28.46 శాతంగా ఉంది. 1,53,695 సముద్ర ఉత్పత్తులు అమెరికా ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోంటుంది. ఆగ్నేయాసియా దేశాలు 24.59 శాతం ఉత్పత్తులను ఇక్కడ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఐరోపా దేశాలు 20.71 శాతం, జపాన్ 8 శాతం, మధ్య ఆసియా 5.90 శాతం, చైనా 4.71 శాతం ఇతర దేశాలు 7.03 శాతం సముద్ర ఉత్పత్తులను భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 2015-16లో విశాఖపట్నం ఓడ రేవు నుంచి రూ. 7,161 కోట్ల విలువైన 1,28,718 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. కృష్ణపట్నం నుంచి రూ. 2,167 కోట్ల విలువైన 38,412 కోట్ల టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయంటే ఆక్వా ఉత్పత్తులు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో అర్ధం అవుతుంది.
ఆక్వా రైతులకు మంచి లాభాలు తెచ్చి పెట్టె వాటిలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ప్రధానమైనవని ఎంపిఈడిఏ జాయింట్ డైరెక్టర్ సిజె సంపత్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను చెన్నై లేదా విశాఖపట్నం నుంచి మాత్రమే ఎగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి ద్వారా రవాణాకు ఆరు గంటలకు పైగా సమయం పట్టడం వల్ల ఉత్పత్తుల నాణ్యతపై ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. మెరైన్ ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయాల్సి ఉంటుంది. మనదేశం నుంచి దాదాపు వంద దేశాలు మెరైన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. వారు నాణ్యత ప్రమాణాలపై ఎక్కువ దృష్టి పెడతారని తెలిపారు. ఆక్వా రైతులకు తమ ఉత్పత్తులకు విలువ మరింత పెరగాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు ఉపకరిస్తాయని ఆంధ్రప్రదేశ్ రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దువ్వూరి రాధాకృష్ణరెడ్డి చెబుతున్నారు. భారీగా ఉత్పత్తులు చేతికి వచ్చినప్పుడు రైతులు ఒత్తిడిలో వాటిని తక్కువ ధరకే వదుల్చుకొనే పరిస్థితి వస్తుందని, అటువంటి తరుణంలో ప్రాసెసింగ్ యూనిట్లు వారికి మంచి ధర వచ్చేలా ఆదుకుంటామని ఆయన తెలిపారు. బాగా సముద్ర ఉత్పత్తులు (చేపలు రొయ్యలు) లభ్యమయ్యే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని తెలిపారు. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పష్టం చేశారు. ఈ యూనిట్లు ఆరెంజ్ కేటగిరీ కింద వస్తాయని, అందువల్ల వీటి వల్ల చాలా తక్కువ కాలుష్యం ఉంటుందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఆక్వాకల్చర్ కీలక పాత్ర
Source: Andhrabhoomi
The post రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఆక్వాకల్చర్ కీలక పాత్ర appeared first on Kisan Updates.