ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితంగా మెరైన్ (సముద్ర) ఉత్పత్తుల ఎగుమతిలో రాష్ట్రo దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ఎంపెడా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2015-16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 9.45 లక్షల మెట్రిక్ టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా, కేవలం ఏపీ నుంచే 1.67 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఈ ఉత్పత్తుల ఎగుమతి ద్వారా దేశవ్యాప్తంగా రూ.30,420.83 కోట్లు ఆదాయం లభించగా మన రాష్ట్రం నుంచి రూ.9,328 కోట్ల ఆదాయం లభించింది. దేశంలో మెరైన్ కార్గోలను పంపించే మేజర్ పోర్టుల్లో విశాఖపట్నం ప్రధానమైనది.
విశాఖపట్నంలో 61 మంది సముద్ర ఉత్పత్తుల ఎగుమతి దారులు రిజిస్టర్ అయిన ఉన్నారు. వీరి ద్వారా 2015 – 16లో విశాఖపట్నం ఓడరేవు నుంచి రూ.7,161 కోట్లు విలువైన 1.28 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఈ ఎగుమతులు చాలా వరకూ తోడ్పాటునందిస్తున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో అత్యధిక వాటా రొయ్యలదే. వనామీ, బ్లాక్ టైగర్ వంటి అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నటు వంటి రొయ్యల ఎగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆక్వా రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆధునిక పద్ధతులను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా ఈ ఏడాది నుంచి ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు ఏపీ సర్కార్ వ్యూహరచన చేస్తోంది.
ఆక్వా రైతులకు మంచి లాభాలు తెచ్చి పెట్టే వాటిలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ప్రధానమైనవి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను చెనై్న, విశాఖపట్నం నుంచి మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. రవాణాకు ఆరు గంటలకు పైగా సమయం పట్టడం వల్ల ఉత్పత్తుల నాణ్యతపై దాని ప్రభావం పడుతోంది. సముద్ర ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయాలి. మన దేశం నుంచి దాదాపు వంద దేశాలు సముద్ర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. వారు నాణ్యత ప్రమాణాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. సముద్ర ఉత్పత్తుల విలువ మరింత పెరగాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు ఉపకరిస్తాయి. ఉత్పత్తి భారీగా ఉన్నప్పుడు రైతులు వాటిని తక్కువ ధరకే అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అటువంటి సమయంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సముద్ర ఉత్పత్తులు లభ్యమయ్యే ప్రాంతాల్లోనే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకూ ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఈ యూనిట్ల ఆరెంజ్ కేటగిరీ కిందకు వస్తాయని, శుద్ధి తర్వాత విడుదలయ్యే జలాలు పంటల సాగుకు కూడా ఉపయోగించుకోవచ్చని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మెరైన్ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో మాత్రమే ఇటువంటి బోర్డు ఉంది. ఆ రాష్ట్రంలో 720 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. 1996లో మహారాష్ట్ర ప్రభుత్వం మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఏపీలో మెరైన్ బోర్డు ఏర్పాటయితే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, ఓడరేవుల నిర్వహణ, వాటి అభివృద్ధి, పోర్టుల్లో ట్రాఫిక్ నియంత్రణ, సముద్ర జలాలకు సంబంధించిన వ్యవహరాలను ఈ బోర్డు చూసుకుంటుంది
Source : Surya
The post ఏపీలో మెరైన్ బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు appeared first on Kisan Updates.